ఆకలేసి ఏడ్చే పిల్లాడి చేతిలో గోలి: “కాపు”ల విషయంలో పవన్ క్లారిటీ ఎంత?

-

తనకు కులాలు మతాలు లేవు.. ఉండవు.. అందుకే అన్ని కులాల, మతాల సమస్యలపై పవన్ స్పందిస్తారు! ఇప్పటికి ఎన్ని విషయాలపై స్పందించారు అనే సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా “కాపు నేస్తం” పథకంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు పవన్! నాడు ఏమైయ్యారో తెలియదు కానీ… టీడీపీని కూడా ఒకమాట అని, అనంతరం జగన్ రెడ్డి అంటూ ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ, డిమాండులు చేశారు.

ఆకలేసి ఏడ్చే పిల్లాడికి చేతిలో గోలి పెట్టి బుజ్జగించాలని చూశాడంట వెనకటికి ఒక తెలివిగల ఆసామి.. ఆంధ్రప్రదేశ్ లో కాపు కార్పొరేషన్ కూడా ఆ మాదిరిగా ఏర్పాటు అయ్యిందే! అంటూ ఒక లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు జనసేన అధినేత. గత ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభం విషయంలోనూ, కాపు రిజర్వేషన్ విషయంలో బాబు ఆడిన ద్వంద్వ వైఖరిపై నాడు అవగాహనలేకో, అప్పటి పరిస్థితులు మాట్లాడనివ్వకో కానీ… కాపులను బీసీల్లో చేర్చే విషయంలో వారిని ఏమార్చడానికే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని పవన్ నేడు ఫీలవుతున్నారు. నాడు టీడీపీ ప్రభుత్వంలో పరోక్ష భాగస్వామి అయిన పవన్.. నేడు ఆ విషయాలపై చాలా ఫీలవుతున్నారు! అవును… ట్విట్టర్ వేదికగా గట్టిగా ఫీలవుతున్నారు.. ప్రశ్నిస్తున్నారు కూడా!

ఈ విషయంలో గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వమూ కూడా కాపులకు ఏమి చేశారు.. ఎంత చేశారు.. కాపుల విషయంలో ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏమిటి అని అన్ని విషయాలు తెలపాలని.. ఈ విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాడ్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… పవన్ ఎక్కడా చంద్రబాబు నాయుడి పేరు ప్రస్థావించకుండా జాగ్రత్త పడుతూ.. గత ప్రభుత్వం అని సంబోధించగా… నేటి ప్రభుత్వం విషయంలో మాత్రం శ్రీ జగన్ రెడ్డి గారు అని లోకేష్, టీడీపీ నేతలు మాదిరిగా పిలవడం కొసమెరుపు.

ఇక్కడ పవన్ గమనించాల్సిందేమిటంటే… “అసలు కాపులని బీసీల్లో చేర్చుతామని మాట ఇచ్చింది ఎవరు.. నాడు ముద్రగడ ఉధ్యమాన్ని నీరుగార్చింది ఎవరు… కాపు కార్పొరేషన్ లో వెయ్యి కోట్లను ఇస్తామనద్ది ఎవరు.. ఇవ్వనిది ఎవరు.. నాడు ప్రభుత్వంలో జరుగుతున్న పనులపై స్పందించకుండా, స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం బాబు మైకంలో మౌనంగా ఉండిపోయి జాతిద్రోహం చేసింది ఎవరు.. 2014 – 2019 ఈ విషయాలపై పవన్ ఎంతమేర ప్రశ్నించారు.. ఎంతమేర పోరాడారు.. అనే విషయాలు” అని పలువురు అభిప్రాయపడుతున్నారు.! వాటిపై కూడా పవన్ ఒకసారి ఆత్మపరిశీలిన చేసుకోవడంతోపాటు, ఒక క్లారిటీ కూడా తెచ్చుకుంటే… నేటి “కాపు నేస్తం” పైనే కాదు.. నాటి “కాపు ద్రోహం” పై మరింత క్లారిటీ వస్తుందని అంటున్నారు ఇంకొందరు!

Read more RELATED
Recommended to you

Exit mobile version