దేశంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య.. వాటిలో గాయపడుతున్న వారు, చనిపోతున్న వారి సంఖ్య .. పెరుగుతూనే ఉంది. అయితే కోవిడ్ లాక్‌డౌన్ పుణ్యమా అని ఈసారి మాత్రం ఆ సంఖ్య బాగా తగ్గింది. మార్చి 24 నుంచి మే 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అమలైన లాక్‌డౌన్ పుణ్యమా అని రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి 62 శాతం మేర తగ్గిందని వెల్లడైంది. దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుప్రీం కోర్టు కమిటీ సేకరించిన నివేదిక ఈ విషయాలను బయట పెట్టింది.
లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రాల్లో గతేడాదితో పోలిస్తే ఈ సారి రోడ్డు ప్రమాదాల్లో 8,976 మరణాలు తక్కువగా నమోదయ్యాయని, 25వేల ప్రమాదాలు తగ్గాయని, 26వేల మంది గాయాల బారిన పడలేదని వెల్లడైంది. అంటే.. ఈ సంఖ్యలో వాహనదారులు కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఈ సారి రక్షింపబడ్డారని అర్థం. ఇక గతేడాదితో పోలిస్తే ఈ సారి లాక్‌డౌన్ సమయంలో మహారాష్ట్రలో 1632 రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయి. రాజస్థాన్‌లో 1171, గుజరాత్‌లో 900, బీహార్‌లో 898, తెలంగాణలో 604 వరకు మరణాలు తగ్గాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ అండ్ డయ్యూలలో ఈ సారి అసలు రోడ్డు ప్రమాద మరణాలే సంభవించలేదు.
గతేడాదితో పోలిస్తే ఈ సారి ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య ఏకంగా 90 శాతం తగ్గగా, కేరళలో 88.7 శాతం తగ్గింది. ఇక ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలు సుప్రీం కోర్టు కమిటీకి ఇంకా సమాచారం పంపలేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఈ సారి జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటిలో చోటు చేసుకున్న మరణాలు, గాయాల బారిన పడ్డవారి సంఖ్య ఇంకా తెలియలేదు. అయితే కేవలం మన దేశంలోనే కాదు.. అనేక దేశాల్లో కరోనా లాక్‌డౌన్‌ను అమలు చేశారు కనుక ఆయా దేశాల్లోనూ ఈసారి రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోకుండా రక్షింపబడ్డారు. అలాగే అనేక మంది గాయాల బారిన పడకుండా తప్పించుకున్నారు. అదే లాక్‌డౌన్, కరోనా లేకుండా ఉంటే.. ప్రమాదాలు, మరణాలు, గాయాల బారిన పడే వారి సంఖ్య గతేడాది కన్నా ఈ సారి ఎక్కువగా ఉండేదని అధికారులు తెలిపారు. అందువల్ల కరోనా పుణ్యమాని మనకు ఈ ఒక్క లాభం అయితే కలిగిందన్నమాట..!