ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ భారత్‌లోని తన స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల కోసం కొత్తగా శాంసంగ్ కేర్ ప్లస్ పేరిట ఓ నూతన సెక్యూరిటీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు తమ ఫోన్లకు మరింత రక్షణ పొందవచ్చు. సర్విఫై అనే కంపెనీతో కలిసి శాంసంగ్ ఈ సదుపాయాన్ని తన కస్టమర్లకు అందిస్తోంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే వినియోగదారులు తమ ఫోన్లను యాక్సిడెంటల్, ఫిజికల్, లిక్విడ్ డ్యామేజ్‌ల నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే సాంకేతిక లేదా మెకానికల్ ఫెయిల్యూర్స్ వచ్చినా భారీ రుసుం చెల్లించాల్సిన పనిలేకుండా ఫ్రీగానే ఫోన్లను రిపేర్ చేయించుకోవచ్చు.
కాగా ఈ సదుపాయాన్ని శాంసంగ్ మార్చిలోనే పైలట్ ప్రోగ్రాం కింద లాంచ్ చేసింది. ఇందులో ఇప్పటికే సుమారుగా 1 లక్ష మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ ప్రోగ్రామ్‌ను శాంసంగ్ ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో పలు రకాల ప్యాకేజీలు గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ల కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.
1. ఎక్స్‌టెండెడ్ వారంటీ
దీని కింద ఫోన్లకు వచ్చే టెక్నికల్, మెకానికల్ ఫెయిల్యూర్స్ కవర్ అవుతాయి. వారంటీ పీరియడ్ ముగిశాక 1 ఏడాది పాటు వర్తించేలా ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు.
2. యాక్సిడెంటల్ అండ్ లిక్విడ్ డ్యామేజ్
ఫోన్లకు జరిగే యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్‌లు ఈ ప్లాన్ కింద కవర్ అవుతాయి. ఏడాది పాటు ఈ ప్లాన్ వాలిడిటీ ఉంటుంది.
3. కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్
1, 2 లలో తెలిపిన ప్లాన్లు ఇందులో కలిపి ఉంటాయి. అంటే ఫోన్లకు వచ్చే టెక్నికల్, మెకానికల్ ఫెయిల్యూర్ సమస్యలతోపాటు ఈ ప్లాన్ కింద యాక్సిడెంటల్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ కవర్ కూడా తీసుకోవచ్చు. ఇది రెండేళ్ల పాటు వాలిడిటీ ఉంటుంది.
ఇక ఈ ప్లాన్లను ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు. అప్లై చేశాక కేవలం 1 గంటలోనే ఈ ప్లాన్లను అప్రూవ్ చేస్తారు. ఇందులో భాగంగా కస్టమర్లు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే శాంసంగ్ ఉచిత పికప్, డ్రాప్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. కానీ పలు ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఇక కేర్ ప్లస్ ప్లాన్లను తీసుకునేందుకు ఫోన్ల ధరలను బట్టి ప్లాన్ల రేట్లు ఉంటాయి.