టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుతో తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. ఓవైపు టీడీపీ కార్యకర్తలు.. మరోవైపు ఇతర పార్టీల నేతలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. రాజమహేంద్రవరం జైలులో ఉన్న బాబును ఇప్పటికే ఆయన కుటుంబంతో పాటు న్యాయవాది లూథ్రా కూడా కలిశారు. ఇక ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లనున్నారు.
ముందుగా వీరు ముగ్గురు రాజమహేంద్రవరంలో భేటీ కానున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇవాళ ఉదయం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం బాలయ్య, పవన్ రాజమహేంద్రవరంలోనే ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌లను పరామర్శిస్తారు. అక్కడి నుంచి పవన్, బాలకృష్ణ, లోకేశ్ కలిసి కేంద్ర కారాగారానికి వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నట్లు సమాచారం. చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తోంది.