ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం రోజురోజుకు రాజుకుంటోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారానికి 48 గంటలే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రేపటితో ప్రచార గడువు ముగియనుండటంతో ఈ కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది కానీ.. బీజేపీ అధినాయకత్వం తనను ఒక్కటే అడిగిందని పవన్ చెప్పారు. మీకు అమరావతి కావాలంటే.. దానిలో మా ప్రాధాన్యం ఉండాలి కదా.. అని బీజేపీ నేతలు అన్నారని, విజయవాడలోని మూడు సీట్లలో ఇద్దరు టీడీపీ నేతలు ఎప్పటి నుంచో ఉన్నారని, అందుకే తాను త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పారు. కానీ.. పశ్చిమ సీటు వదిలేసేటప్పుడు తాను బీజేపీని రెండు విషయాలు అడిగానన్న పవన్.. ఒకటి అమరావతి, రెండు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడాలని అని తెలిపారు. వాళ్లు అంగీకరించడం వల్లే సీటును వదులుకున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.