పరాజయంలో ఓదార్పే ఊపిరని.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శనీయమన్నారు పవన్ కళ్యాణ్. విజయాలు వరించినప్పుడు పొగడ్తలతో ముంచెత్తేవారు కొల్లలుగా ఉంటారని.. అదే అపజయం వెంటాడినపుడు ఓదార్చేవారు అరుదుగా మాత్రమే కనిపిస్తారని వెల్లడించారు. నిజానికి సత్ఫలితాలు వచ్చినప్పుడు చేసే సన్మానాలు కంటే పరాజయంలో వెన్నంటి ఉన్నవారే గొప్పగా కనపడతారని.. మన ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు చెప్పడం, శుభాకాంక్షలు అందచేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదని వెల్లడించారు.
దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తేవడానికో, దేశానికి విజయాలు సాధించి పెట్టడానికో పరితపిస్తూ.. పరిశ్రమిస్తూ త్రుటిలో విజయానికి దూరమైన వారికి భరోసాగా నిలవడం నన్నెంతో ఆకట్టుకుందని.. బ్రిటన్ లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడా పోటీలలో మహిళా కుస్తీ పోటీలో బంగారు పతకం చేజారిపోయి కాంస్యం మాత్రమే దక్కించుకున్న పూజ గెహ్లాట్ ను మోడీ ఓదార్చిన తీరు అద్భుతమని కొనియాడారు.
దేశానికి బంగారు పతకం అందించలేకపోయానని, దేశ ప్రజలు క్షమించాలని విలపిస్తున్న వీడియోను చూసి మోడీ స్పందించిన తీరు మానవీయంగా ఉందని.. “నీ విజయం దేశానికి వేడుకలను తీసుకొచ్చింది.. క్షమాపణలు కాదు. నీ విజయాన్ని చూసి ఉత్తేజితులమయ్యాం.. నీ విజయం మాకో అద్భుతం” అని మోడీ ఆమెకు పంపిన సందేశం కదిలించేలా ఉందని ప్రశంసించారు పవన్ కళ్యాణ్.