పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అది జాతీయ ప్రాజెక్టు అని, పోలవరం పూర్తి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నానని భరోసా ఇచ్చారు. దీని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే రూ.15వేల కోట్లకుపైగా విడుదల చేసిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి తాము ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్మాణ పనులను రోజువారీగా పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ అంశాల్లో సాయం చేయడానికి వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నామని వివరించారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తనది అని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. డీలిమిటేషన్‌లో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వనని మోదీ తేల్చి చెప్పారు.