నాలుగో విడతలో లోక్ సభ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 1,710 మంది అభ్యర్థుల్లో 21 శాతం మందిపై క్రిమినల్ కేసులు అంటే 360 అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. 11 మందిపై హత్య, 30 మందిపై హత్యాయత్నం, 50 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఐదుగురు అభ్యర్థులపై అత్యాచార అభియోగాలు నమోదైనట్లు తెలిపింది.
మరోవైపు అభ్యర్థుల ఆస్తులను విశ్లేషించిన ఏడీఆర్ .. 1,710 మంది అభ్యర్థుల్లో 476 మంది కోటీశ్వరులని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధికంగా రూ.5 వేల కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచినట్లు చెప్పింది. 24 మంది అభ్యర్థులు అఫిడవిట్‌లో ఆస్తులను ప్రకటించలేదని తెలిపింది.
నాలుగో విడతలో భాగంగా ఈనెల 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్ తదితర రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4 వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.