ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం ఏపీలోని విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. కాసేపట్లో బీజేపీ చేపట్టనున్న శోభాయాత్ర ర్యాలీలో ప్రధాని పాల్గొననున్నారు.
‘ఐఎన్‌ఎస్ డే’గా విమానాశ్రయం నుంచి మొత్తం 3 కిలోమీటర్ల మేర ఇరువైపులా ప్రజలకు అభివాదం చేస్తూ తూర్పు నౌకాదళ స్థావరంలోని ఐఎన్‌ఎస్ చోళా వరకు ర్యాలీ జరగనుంది. రాత్రి 8గంటల తర్వాత భాజపా నేతలతో, అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనూ ప్రధాని వేర్వేరుగా భేటీ కానున్నారు. శనివారం ఉదయం ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో రూ.15,233 కోట్ల విలువైన 9 ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రధాని మోదీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు.
ప్రధాని పాల్గొనే బహిరంగ సభ వేదికపైకి 8మందికే అనుమతి లభించింది. ఈ సమావేశంలో మాట్లాడేందుకు సీఎం జగన్‌కు 7 నిమిషాల సమయం ఇచ్చారు. విశాఖ సభలో ప్రధాని మోదీ దాదాపు 40 నిమిషాలు ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించనున్నారు.