టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది తమ అభిప్రాయమని పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులేనని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుపై ఉన్నకేసులు కోర్టుల్లో ఉన్నాయని.. వాటిపై మాట్లాడితే సబ్ జుడిస్ కిందకు వస్తుందని అన్నారు.
నారా లోకేష్‌ను అమిత్ షా పిలిచారా? లేదా అమిత్ షాను కలవాలని లోకేష్ అడిగారా? అనేది అప్రస్తుతమని పురందేశ్వరి అన్నారు. అమిత్ షా, లోకేష్ భేటీ జరిగిందని చెప్పారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారని.. ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని తెలిపారు. కిషన్ రెడ్డి పిలిచినట్టుగా లోకేష్ అన్నారని.. దాని గురించి ఆయననే అడగండి అని పరందేశ్వరి అన్నారు.
గోదావరి జలాలను పెన్నాతో లింక్ చేసే ప్రాజెక్టును గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని పురందేశ్వరి విమరశించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం గోదావరి-పెన్నా ప్రాజెక్టు డీపీఆర్ చూపించి రూ. 2 వేల కోట్లు అప్పు తెచ్చిందని.. ఇది దారుణం కాదా? అని ప్రశ్నించారు. గతంలో ఏదైనా ఆరోపణలు వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ ఎంక్వైరీ వేయించారని.. ఇప్పుడు ఆయన మీద వస్తున్న ఆరోపణల మీద జగన్ సీబీఐ విచారణ కోరగలరా? అని సవాల్ విసిరారు.