తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే తమ పార్టీ పని అవుట్ అని, బంగాళాఖాతంలో కలిసిపోతాం అని, తమకు విశాలమైన తీర ప్రాంతం ఉన్నదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చెబుతుంటారని, ఆ తీర ప్రాంత గర్భంలో తమ పార్టీ కలిసి పోవడం ఖాయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు స్థానికంగా బలం కలిగిన ఐదారు మంది నాయకులు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలవవచ్చునని, ఇప్పటికీ రాయలసీమలో తమ పార్టీకి ఎంతో కొంత బలం ఉందని, అక్కడ కూడా అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయితే తమ పార్టీ పరిస్థితి అద్వానమేనని అన్నారు.
అవినాష్ రెడ్డి గారి అరెస్టుపై దాగుడుమూతల దాంపత్యం కొనసాగుతున్నప్పటికీ 24 గంటలలో లేదంటే 48 గంటలలో ఆయన్ని సీబీఐ అరెస్టు చేయడం ఖాయమేనని అన్నారు. తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిస్తే తమ పార్టీకి భవిష్యత్తు లేదని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీని ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని, అది తమ దురదృష్టం… తమ పార్టీ దురదృష్టం అని, తమని ఎలాగైనా వదిలించుకోవాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు.