TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు సోమవారం ఏకంగా కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను 12 గంటల పాటు విచారించారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల తదితర అనేక అంశాల గురించి వీరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
క్వశ్చన్ పేపర్ల విక్రయంతో వచ్చిన నిధులను మళ్లించి ఉంటారన్న అనుమానంతో ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. న్యాయస్థానం నుంచి అవసరమైన పత్రాలు తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రధానంగా మూడు సెట్ల ప్రశ్నపత్రాలు తయారు చేయించడం, కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో భద్రపరచడం, ముద్రణ, పంపిణీ.. ఇలా మొత్తం ప్రక్రియను అడిగి తెలుసుకొని, నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కార్యదర్శి అధీనంలోనే ఉంటుంది. ప్రశ్నపత్రాలు బయటకు పొక్కకుండా తీసుకునే జాగ్రత్తల గురించి కార్యదర్శిని ప్రశ్నించిన అధికారులు.. అవి సహాయకుడు ప్రవీణ్ చేతికి ఎలా చిక్కాయని అడిగినట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ప్రశ్నపత్రం లీకైనట్లు ఓ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది. అప్పటివరకూ లీకేజీ గురించి కమిషన్ అధికారులు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఈడీ అడిగినట్లు తెలుస్తోంది.