గతకొన్ని రోజులుగా పార్టీకి చేయాల్సిందంతా చేస్తూ.. జగన్ కు చెప్పాల్సిందంతా చెబుతూ.. విసిగించాల్సినంత విసిగిస్తూ.. చేయాల్సినంత రచ్చ చేస్తూ.. తనదైన గోదావరిజిల్లా వెటకార పదప్రయోగాలు సంధిస్తూ.. అప్పుడప్పుడూ సాయిరెడ్డిపై సెటైర్లు వేస్తూ.. చివరాఖరున తాను పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, వైఎస్ జగన్ ను వీరాభిమానిని అంటున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు! ఈ క్రమంలో చాలామంది ఊహించిన వ్యాఖ్యాలు వాడుతూనే జగన్ ఆరు పేజీల లేఖను పంపించారు!
ఈ మధ్య విజయసాయిరెడ్డి నుంచి నోటీసు అందిందని, ఆయన లేఖకు స్పందిస్తూ రిప్లై ఇస్తున్నట్లుగా ప్రస్థావించిన రఘురామకృష్ణరాజు… సీ ఓటర్ సర్వేలో 4వ స్థానం వచ్చినందుకు జగన్ కు అభినందనలు.. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ నెమ్మదిగా మొదలుపెట్టారు! అనంతరం తనకు లేఖ పంపించడానికి విజయసాయిరెడ్డి ఎవరంటూ నిలదీయడం మొదలుపెట్టారు. రిజిస్టరయిన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ లెటర్ హెడ్ తో నోటీసు అందిందని.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని.. రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.
తనను బీ ఫార్మ్ ఇచ్చింది యువజన శ్రామిక రైతు కాంగ్రేస్ పార్టీ కాగా… నాకు షోకాజు నోటీసులు పంపింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆని రఘురామకృష్ణం రాజు మరోసారి జగన్ కు గుర్తుచేశారు. ఇలా ఎన్ని విషయాలు చెప్పినా.. ఎలా చెప్పినా.. రఘురామ కృష్ణం రాజు వీటన్నింటివల్ల స్పష్టం చేస్తుంది మాత్రం… నన్ను వదిలేయండి బాబూ, నేను వెళ్లిపోతాను నాయనా అనే అంటున్నారు విశ్లేషకులు. అంత కష్టపడి గెలిపించుకున్న తర్వాత ఎలా వదిలేస్తామన్నది వైకాపా అధినాయకత్వం ఆలోచన అన్నది ఒక వాదన!
అంత పౌరుషం ఉన్న వ్యక్తి అయితే ఏ పార్టీ బీఫారం మీద గెలిచారో.. ఆ పార్టీకి రాజినామా చేసి, మళ్ల్లీ తనదైన గ్లామర్ తో ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కదా అని వస్తున్న సూచనల సంగతి కాసేపు పక్కన పెడితే… నేడు వైకాపాకు పంటికింద రాయిలా మారి, ఏరు దాటాక తెప్ప తగలేసే కార్యక్రమానికి పూనుకుంటే… గతంలో వైకాపా జెండాతో గెలిచి సైకిలెక్కిన చాలా మంది భవిష్యాత్తులాగానే రఘురామకృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు కూడా మారిపోయే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అయినప్పుడు… పార్టీలో ఏదైనా మిస్టేక్ జరిగితే అది పార్టీలోనే చర్చించాలి.. లేదా పార్టీకి రహస్యంగా తెలియజేయాలి తప్ప.. మీడియాకు ఎక్కి నానా అల్లరీ చేసి, అబ్బే తాను చాలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని అనడాన్ని… నోటితో చెప్పి నొసటితో వెక్కిరించడం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా… ఈ దెబ్బతో తనకు పార్టీలో ఉండాలని లేదనే విషయం దాదాపు చెప్పేసినట్లే అనేది కొందరి వాదన కాగా… ఇంతకన్నా క్లారిటీగా ఏమి చెప్తారు అనేది మరికొందరి వాదన!
మరి ఈ రెబల్ ఎంపీ రచ్చపై “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ” అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అనేది వేచి చూడాలి! ఇలానే నాలుగు రోజులు మాట్లాడనివ్వండి.. జనాల లాగానే, తర్వాత మీడియాకూడా లైట్ తీసుకుంటుంది అని ఆలోచిస్తారా లేక.. అవసరమా ఈ తలనొప్పి తతంగం అని సస్పెండ్ చేస్తారా.. అదీగాక ఉప ఎన్నికలకు వెళ్లేలా అస్త్రాలను ప్రయోగిస్తారా అనేది వేచి చూడాలి!
కొసమెరుపు: ఇదిలా ఉంటే ప్రధాని మోదీపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఓ సాంగ్ విడుదల చేశారు. సాంగ్ ను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు.