ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్డులపై ఏర్పడిన గుంటలను పూడ్చి మరమ్మత్తులు చేయాలంటే ఏదైనా ఒక పథకాన్ని నిలిపివేయాల్సిందేనా అని రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. భీమవరంలో రోడ్లపై ఏర్పడిన గుంటలో పడి ముగ్గురు మృతి చెందారని, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు నిలిపివేస్తే రోడ్లపై ఏర్పడిన గుంటలను పూడ్చడంతో పాటు మరమ్మతులు చేయవచ్చు అని ఒక మంత్రి అంటే, అమ్మ ఒడిని ఆపేస్తే రాష్ట్రంలోని రోడ్డులు అద్దాలలా మెరుస్తాయని మరొక మంత్రి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లను రిపేరు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేస్తుందా?! అని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టును మొదట 2022లో పూర్తి చేస్తామన్నారని, ఆ తర్వాత 2023 అని ఇప్పుడేమో 2025 లో పూర్తి చేస్తామని అంటున్నారని, 2024లో పూర్తి చేస్తామంటే ఎక్కడ ఎన్నికల ముందు ప్రజలకు దొరికిపోతామెమోననే 2025 అంటున్నారని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, పోలవరం ప్రాజెక్టును బ్రష్టు పట్టించారని, ఒక జులాయి, తాగుబోతు భర్త ఉన్న కుటుంబం ఎంత విధ్వంసం అవుతుందో, అంతకంటే ఎక్కువగా రాష్ట్రాన్ని దారుణమైన విధ్వంసానికి మా ప్రబుద్ధులు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.