స్కిల్ డెవలప్మెంట్ కేసు సర్వం డొల్ల… ఈ కేసు దెబ్బకు మా పార్టీ అవుతుంది గుల్ల అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు వ్యాఖ్యానించారు. ఈ కేసులో నూటికి నూరు శాతం తమ ప్రభుత్వమే దోషి అని, ఫైల్ లేకుండానే కేసు నమోదు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒరిజినల్ ఫైల్ ఉంటే ఆనాటి ప్రభుత్వ అదనపు కార్యదర్శి అజయ్ కల్లం గారిని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యదర్శిగా వ్యవహరించిన ప్రేమ్ చంద్రారెడ్డి గారిని అరెస్టు చేయాల్సి వస్తుందని, అసలు కుంభకోణమే జరగని కేసులో సొంత సామాజిక వర్గ అధికారులు ఇరుక్కుపోతారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, తన రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సిట్ పోలీసు అధికారి రఘురామిరెడ్డిల సహకారంతో ఒరిజినల్ ఫైల్స్ మాయం చేశారన్నారు. నోట్ ఫైల్ అన్నదే లేకుండా కేసు నమోదు చేయడం ఏమిటో అంతు చిక్కడం లేదన్నారు.
పివి రమేష్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశామని చెబుతున్న సీఐడీ అధికారులు, అదే వ్యక్తి ఒరిజినల్ ఫైల్ లేకుండా కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ద్వారా తమ ప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయం అని అన్నారు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సు నిర్వహిస్తుంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వల్ల, ఆ సదస్సు గురించి తెలుగు రాష్ట్రాలలో పట్టించుకున్న వారే లేరని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి కేసు అప్డేట్స్ కోసమే నిరీక్షించే పరిస్థితి నెలకొందని, ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తనకు తానే పిన్నవయస్కుడినని చెప్పుకునే ముఖ్యమంత్రి గారికి చివాట్లు పెట్టనున్నట్లు తెలిసిందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.