సాక్షి దినపత్రికపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటాడుకుందాం రా పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం ద్వారా క్రీడాకారులకు ఎంత మేలు జరుగుతుందో తెలియదు కానీ సాక్షి దినపత్రికకు మాత్రం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో లాభం వస్తుందని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆటాడుకుందాం రా కార్యక్రమానికి ఎవరైనా ప్రముఖ క్రీడాకారుల ఫోటోను ఉపయోగించి ఉంటే బాగుండేదని, దానికి కూడా ముఖ్యమంత్రి గారి ఫోటోనే ముద్రించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
నారా లోకేష్ గారు నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్ర దినదినాభివృద్ధి చెందుతూ, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించే విధంగా కొనసాగాలని రఘురామకృష్ణ రాజు గారు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారనుందని తెలిసి అధికారులు బదిలీపై వెళ్లినా లాభం లేదని, ఈ ప్రభుత్వం ఉన్న కొన్ని నాళ్లలో పశ్చాతాపంతో ప్రజలకు మేలు జరిగే విధంగా పనిచేస్తే మంచిదని హితవు పలికారు. విశాఖ వాసులకు రానున్నది గడ్డుకాలమని, ఎవరైనా రాష్ట్ర హైకోర్టును లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించితే మంచిదన్నారు.