తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమేనని, ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చునని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టే అవకాశాలు కనిపించడం లేదని, అప్పు లభించకపోతే ఒక్కరోజు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడపలేరని వెల్లడించారు.
దీనితో చేసేది ఏమి లేక ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే ఆయన ముందున్న మార్గం అని, ఆగస్టులో ప్రభుత్వాన్ని రద్దు చేసి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. తాజాగా, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ముందస్తు ఎన్నికల కోసమే మా పార్టీ ప్రభుత్వం చాప కింద నీరులా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయిస్తోందని, గుంటూరు పట్టణంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు వెలుగు చూసిన విషయం తెలిసిందేనని, అలాగే విశాఖపట్నం తూర్పులోను ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులకు చెందిన 30 వేల ఓట్లను అక్రమంగా తొలగించారని, తమ పార్టీ సానుభూతిపరుల ఇండ్లలో లేని వారి పేరిట దొంగ ఓట్లను నమోదు చేస్తూ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లను ఎత్తివేస్తున్నారని అన్నారు.