ఏపీలో ర్యాలీలు, సభలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోపై ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించోద్దని తాము చెప్పలేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిపక్షాలతో పాటు అధికారంలో ఉన్న వైసీపీకి కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. రోడ్లు ఉన్నది రాకపోకలకే తప్ప సభలు, సమావేశాల కోసం కాదని తేల్చి చెప్పారు.
రోడ్లపై సభలు, ర్యాలీలను మాత్రమే ప్రభుత్వం నిషేధించిందని.. ఈ జీవో వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని వెల్లడించారు. ఈ జీవోలో కొత్తవి ఏమీ లేవని, గతంలో ఉన్న వాటిని ఇప్పుడు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోను చీకటి జీవో అనడంలో అర్థం లేదని అన్నారు సజ్జల.