పంచాయితీల డబ్బులను నొక్కేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సర్పంచులు, వార్డు సభ్యులు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి ప్రశ్నించాలని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారిని మంత్రులను నిలదీయాలని, పార్టీ పనుల కోసం పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి గారు రూపొందించారని, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసి పార్టీ పనులను చేయించుకుంటున్నారని చెప్పారు రఘురామకృష్ణ రాజు.
పంచాయతీ రాజ్ వ్యవస్థలో సర్పంచులు, వార్డు సభ్యులు ఉండగా వాలంటీర్ వ్యవస్థ అవసరమేముంది? అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని దయచేసి ప్రతిపక్ష పార్టీలు చెప్పవద్దని, వాలంటీర్లకు మెరుగైన ఉద్యోగ అవకాశాలను కల్పించండని, నాలుగు ఓట్ల కోసం వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పే బదులు, వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని, వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ప్రశ్నించడం జరిగిందని, ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అక్కరకు లేని వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేసి వాలంటీర్లుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి 20 నుంచి 25 వేల రూపాయల వేతనం కలిగిన ఉద్యోగ అవకాశ కల్పన కోసం కృషి చేయాలని అన్నారు రఘురామకృష్ణ రాజు.