“నా నియోజకవర్గంలో ఎవరికైనా అవసరమైతే దోసెడు ఇసుక కూడా దొరకడం లేదు.. కలెక్టర్ కు చెప్పినా ఉపయోగం ఉండడం లేదు.. అమరావతిలో ఇసుకతో బయల్దేరిన లారీ.. వినుకొండ రాకుండానే మాయమవుతోంది” – బొళ్ల బ్రహ్మనాయుడు, వైసీపీ ఎమ్మెల్యే, వినుకొండ నియోజకవర్గం.
“ఇసుక దోపిడీ గురించి మా ముఖ్యమంత్రి జగన్ గారికి తెలియదు. ఇసుక దొరకలేదని సీఎంకు తెలిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ ఆయన దగ్గరికి చేరే మార్గం ఏదీ? ఆయన చుట్టూ ముళ్ల కంచె లాంటి కోటరీ ఉంది. దాన్ని దాటుకుని వెళ్లడం అసాధ్యం” – రఘురామకృష్ణంరాజు, వైసీపీ ఎంపీ, నర్సాపురం.
వైసీపీ ఎమెల్యే కాస్త సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తే… ఎంపీ కాస్త వెటకారాన్ని మిక్స్ చేసి చెప్పారు.. గోదావరి జిల్లా మనిషి కదా! కానీ… ఇద్దరి సమస్యా ఒక్కటే, ఇద్దరి కంప్లైట్ ఒక్కటే… ఇసుక దొరకడం లేదని! ఇది ప్రస్తుతం ఏపీలో నెలకొన్న ఇసుక సమస్యపై స్వయంగా అధికారపార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు, వెళ్లుబుచ్చుతున్న బాదలు! ఇంతకాలం ఇసుకపై టీడీపీ నేతలు ఒకరకమైన విమర్శలు చేస్తే, దానికి తోడు సొంత నేతలే ఇసుక విషయంలో విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఇసుక వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలు ప్రస్తుతం ఇసుకమీద ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు మరింత బలాన్ని ఇస్తున్నాయడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.
దీంతో సంక్షేమం విషయంలో ఎంతో ముందుకు పోతున్న జగన్ కు ఈ ఇసుక వ్యవహారం ఇంటా బయటా తలనొప్పులు తెచ్చేలా ఉందనే కామెంట్లు పడుతున్నాయి. ఈ ఇసుక విషయంలో జగన్ దృష్టి సారించకుండా.. తమ నేతలకు అందుబాటులో ఉండని పక్షంలో.. మొన్న రఘురామకృష్ణం రాజు, నిన్న బొళ్ల బ్రహ్మనాయుడు.. రేపు ఇంకొకరు? ఇలా ఒకరితర్వాత ఒకరు మీడియా ముందుకు వస్తే మాత్రం పరిస్థితి అదుపుతప్పే అవకాశాలు లేకపోలేదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలకు ఇక పండగే పండగ! ఇదే సమయంలో ఐసీయూ లో ఉన్న టీడీపీకి ఆక్సిజన్ దొరికినంత పని అవుతుంది! కాబట్టి… ఈ విషయంలో సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కూకటివేళ్లతో సహా పీకి పారేసే పనికి జగన్ పూనుకోవాలని పలువురు సూచిస్తున్నారు.