ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు కీలక నేతలకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో కసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను విచారించిన సిట్.. తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారిస్తోంది. ఇవాళ ఉదయం విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన్ను… గత ఐదు గంటలుగా అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.

విజయసాయి రెడ్డి ఇంట్లో 2 దఫాలుగా జరిగిన చర్చలపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనంతరం మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు లాయర్ సమక్షంలో మిథున్ రెడ్డిని సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని బృందం ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్యరాజ్‌లతో సంభాషణలపై అతడిని ఆరా తీసినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీపై జరిగిన సంభాషణలపైనా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి వెల్లడించిన వివరాల ఆధారంగా మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.