మూసీ నది ప్రక్షాళనను కొంతమంది అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్నారని, కేవలం కాలుష్యం వల్లే దేశ రాజధాని స్తంభించిపోయే పరిస్థితి ఉందని అన్నారు. ఆ పరిస్థితులను చూసి గుణపాఠం నేర్చుకోవాలని.. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కానీ ఈ మంచి కార్యాన్ని కొంతమంది కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
“ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ ఆశించిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధించింది. తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నాం. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్‌ను చూశాం. నీరు మన సంస్కృతి, అభివృద్ధికి ప్రతీక. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. ఇక హైదరాబాద్ లో మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ రాష్ట్ర పురోగతికి అత్యంత కీలకమైన అంశాలుగా భావిస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి జపాన్ తెలుగు సమాఖ్య సహకారం అవసరం.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.