అధికార వైకాపా నుంచి త్వరలోనే ఓ 50 మంది ఎమ్మెల్యేలు కుదిరితే తెలుగుదేశం లేదా జనసేన పార్టీలలో చేరే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆ రెండు పార్టీలలో చేరడం కుదరకపోతే నిజానికి వారంతా కాంగ్రెస్ వాదులే కాబట్టి తనకున్న సమాచారం మేరకు పిల్ల కాంగ్రెస్ నుంచి తల్లి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు కాకపోతే 2029లోనైనా బాగుపడతామనే ఉద్దేశంతో వారు వైకాపాకు గుడ్ బై చెప్పబోతున్నారని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ పదవులలో వైకాపాకు ఒకటి దక్కకపోవచ్చునని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైకాపా నాయకత్వం కంగారుగా మూడేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన టీడీపీ శాసనసభ్యులు ఘంటా శ్రీనివాసరావు గారి రాజీనామాను ఆమోదించడం ద్వారా వైకాపా ప్రభుత్వం ప్రైవేటీకరణకు మద్దతునిస్తోందని చెప్పకనే చెప్పిందని అన్నారు. వైకాపా నుంచి టీడీపీ వైపు వచ్చిన వారిపైనే వేటు వేస్తారా? లేకపోతే టీడీపీ నుంచి అనధికారికంగా వైకాపాలో చేరిన శాసనసభ్యులపై కూడా వేటు వేస్తారా?, ఒకవేళ కేవలం వైకాపాలో గెలిచి టీడీపీకి మద్దతునిస్తున్న నలుగురు శాసనసభ్యులపైనే వేటు వేస్తే కుదురుతుందా?? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.