అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని తెలిపారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని.. మిగతా గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని వెల్లడించారు. ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని గవర్నర్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ప్రసంగించారు.
అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన సాగుతోంది. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. ఉద్యోగాల భర్తీపై ఎలాంటి అపోహలకూ యువత లోను కావొద్దు. దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలు కుదుర్చుకున్న సీఎంను, ఆయన బృందాన్ని అభినందిస్తున్నాను. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రజావాణి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోనూ అమలుచేసే యోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అని గవర్నర్ అన్నారు.