వర్చువల్ మహానాడు… ఆత్మవంచనతో కూడిన ఆనందమా?

-

తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే మహానాడును బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! కరోనా వ్యాప్తి దృష్ట్యా… పార్టీ చరిత్రలో తొలిసారిగా వర్చువల్ మహానాడు జరగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్ ఆర్ ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్ యాప్ ద్వారా భాగస్వాములవుతుంటుండగా… యూట్యూబ్ , ఫేస్ బుక్ లైవ్ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా… ఒక రాజకీయ పార్టీ… ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్ లైన్ లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి అని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ… ఈ వీక్షకుల నెంబర్ గమనించినవారు మాత్రం ఇది ఆత్మవంచనతో కూడిన ఆనందంగా అభివర్ణిస్తున్నారు!

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ ప్రాంతీయ పార్టీ టీడీపీ! రెండు తెలుగు రాష్ట్రాలను అత్యధిక కాలం పరిపాలించిన ప్రాంతీయ పార్టీ! ఇవి చెరిగిపోని రికార్డులే.. వీటిని కాదనేవారు లేరు! కాకపోతే… ఆఫ్ లైన్ లో కార్యక్రమం నిర్వహిస్తుంటే జనసమీకరణకు లిమిట్ పెట్టుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు కానీ.. ఆన్ లైన్ లో నిర్వహించే కార్యక్రమానికి కూడా “వీక్షకుల సంఖ్య ఇంతే” అని ఫిక్సవ్వడంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆన్ లైన్ లో జూం యాప్ అంటే పోని కొన్ని ప్రత్యేక అనుమతులు ఉన్నాయేమో అందుకే 14 వేల మంది అని లిమిట్ పెట్టుకున్నారు అని సరిపెట్టుకుందామంటే… యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా 10వేల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశామని పార్టీ వర్గాలు చెప్పడమే హాస్యాస్పదం అంటున్నారు!

ఏ చిన్న కార్యక్రమం జరిగినా యూట్యూబ్ లో కోట్లల్లో వ్యూస్, లక్షల్లో లైవ్ వ్యూస్ వస్తున్న ఈ రోజుల్లో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహనాడు ఆన్ లైన్ వీక్షకులు కూడా వేల సంఖ్యలో అని చెప్పడం కాస్త ఇబ్బందికరమైన విషయమే అనేది తమ్ముళ్ల మాటగా ఉంది. ఈ సమయంలో ఆన్ లైన్ లో లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొనబోతున్నారని.. యూట్యూబ్లో కోట్లమంది చూడబోతున్నారని చెప్పుకుంటే ఆ లెక్క వేరేగా ఉండేది! దీంతో… ఈ వర్చువల్ మహానాడు రికార్డుల విషయంలో బాబు ఆనందమంతా ఆత్మవంచనతో కూడుకున్నదే అనేది పలువురి అభిప్రాయంగా ఉంది!!

ఏది ఏమైనా… ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితులు, ప్రతిపక్ష హోదా పోగొట్టడానికి వైకాపా చేస్తున్న ఎత్తుగడలు, కరోనా సమయంలో తీవ్రంగా మూటగట్టుకున్న అపఖ్యాతి నడుమ కూడా బాబు నవ్వుతూ మహానాడు కార్యక్రమాల్లో పాల్గొనడంపై తమ్ముళ్లు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news