రాష్ట్రంలో జిల్లాల విభజన అనే అంశం.. ఇప్పుడిప్పుడే తెరమీదికి వస్తోంది. ఇటీవల అధికార పార్టీ నాయకుడు, మాజీ మంత్రి, శ్రీ కాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు.. ఈ విషయాన్ని తెరమీదికి తెచ్చారు. దీంతో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం నుంచి కూడా గళాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనికన్నా ముందుగా.. టీడీపీలో అంతర్గత చర్చలు సాగాయి. జిల్లాల విభజన అనే విషయం తెరమీదికి వస్తే.. తమకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందోనని టీడీపీ నేతలు అల్లాడి పోతున్నారు. ఇప్పటికే.. పేదలకు ఇళ్లు పథకంలో భాగంగా అనేక నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పేదలను మోహరించారు. అది కూడా టీడీపీకి
తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారింది.
ఈ విషయంపైనే ఇప్పటి వరకు పార్టీ తీవ్రంగా మధన పడుతుండగా.. మరోవైపు జిల్లాల విభజన మరింతగా ఎఫెక్ట్ అవుతుందని పార్టీ భావిస్తోంది. అత్యంత కీలకమైన, టీడీపీ అనుకూల జిల్లాల పరిధులు తాజా విబజనతో హద్దులు మారిపోతాయి. దీంతో సమీప నియోజకవర్గాల్లో కలిసిపోతాయి. దీంతో ఈ పరిణామం.. తమకు పూర్తిగా దెబ్బేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయంపై చంద్రబాబు కూడా దృష్టి పెట్టారు.
ఇప్పటికే నెల్లూరులో తమ జిల్లాను విభజించవలసిన అవసరం లేదని.. అలా విభజిస్తే.. కొన్నిప్రాంతాలు తిరుపతి పార్లమెంటు నియజకవర్గంలో కలుస్తాయని.. కాబట్టి మొత్తానికే జిల్లా రూపు రేఖలు మారిపోతాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే తరహా ఆలోచన పార్టీలోని చాలా మంది నాయకులు చేస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వం ఈ జిల్లాల ఏర్పాటు, విభజనలపై నిర్ణయం తీసుకోలేదని, కాబట్టి దీనిపై ఇప్పుడే పోరాడాల్సిన అవసరం లేదని కూడా పార్టీ సీనియర్లు.. చంద్రబాబుకు సూచించినట్టు తెలిసింది. జగన్ వేసిన ఈ ప్లాన్ ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, జిల్లాల్లో మాత్రం విభజనకు వ్యతిరేకంగా సంస్కృతి, వారసత్వ సంపద, ఎన్నో ఏళ్లుగా ఉన్న యాస, భాష, వేషాలపై సెంటిమెంటును రగిలించేలా కార్యక్రమాలు రూపొందించాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. దీనికి నాయకులు కూడా రెడీ అవుతున్నారు. అంటే.. తమ జిల్లాను విడదీసి.. వేరే పార్లమెంటు స్థానంతో కలపడం ద్వారా తమ సంస్కృతి దెబ్బతింటుందనే సెంటిమెంటును ప్రజల్లో రగిలించడం ద్వారా జగన్ ప్లానుకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ భావిస్తోంది. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.