వైఎస్ఆర్సిపి నేత, మాజీమంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విచారణ నేడు ఓ కొలిక్కి వచ్చింది. పేర్ని జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.
పేర్ని నాని తన సతీమణి పేరుతో పౌరసరఫరాల సంస్థకు మచిలీపట్నంలో గోదాం అద్దెకి ఇచ్చారు. అయితే తమ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ పై కేసు నమోదు అయింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధ పై మచిలీపట్నం బందరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు శుక్రవారం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా లంకె వెంకటేశ్వరరావు వ్యవహరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 30న బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులు ఇవ్వనున్నారు.