ఏపీ ఉద్యోగుల్లో ముసలం నెలకొంది. ఏపి సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి వైదొలగాలని ఆ సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. సచివాలయంలో నిన్న జరిగిన అప్సా జనరల్ బాడి మీటింగులో వెంకటరామి రెడ్డి అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని తీర్మానం పెట్టారు ఉద్యోగులు. నెలలుగా ఏపి సచివాలయ ఉద్యోగుల సంఘం క్రియాశీలకంగా లేకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వ హయాలో అప్సా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు ఉద్యోగులు.
ప్రస్తుత ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించలేని స్థితిలో సంఘం ఉందని ఆక్షేపణ చూపించారు. అప్సా కార్యవర్గం మొత్తాన్ని అధ్యక్షుడితో సహా రీకాల్ చేయాల్సిందిగా తీర్మానం చేశారు. వెంకట్రామిరెడ్డి సహా కార్యవర్గం రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాల్సిన సంఘం పరిధి దాటి రాజకీయ రంగు పులుముకుందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్సా కార్యవర్గం పూర్తిగా వైదొలగడమే మేలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఉద్యోగులు. ప్రస్తుత కార్యవర్గం తొలగి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.