“స్థానిక ఎన్నికలు ఏం చేస్తాయ్?“ ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఏ ఇద్దరుకలిసినా.. ఫోన్లు చేసుకున్నా.. స్థానిక ఎన్నికల విషయంపైనే తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఈ ఏడాది మార్చిలో ముగియాల్సిన స్థానిక ఎన్నికలు కరోనా నేపథ్యంలో అనూహ్యంగా వాయిదా పడిన విష యం తెలిసిందే. అయితే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పావులు కదుపుతోంది. ఈ నెల 28న ఆల్ పార్టీ మీటింగ్‌కు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపు కూడా ఇచ్చేసింది. దీంతో ఏం జరుగుతుంది? అనేది ప్రధాన టెన్షన్‌గా మారింది.
అయితే, ఇక్కడ వచ్చిన చిక్కల్లా.. ఎన్నికలకు వెళ్లడానికి ఇబ్బంది కాదు.. అయితే, ఇప్పటికే 200లకు పైగా స్థానాల్లో జరిగిన ఏకగ్రీవాలపైనే వీరు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి.. ప్రతిపక్షాలు మొత్తం స్థానిక ఎన్నికలను ఆది నుంచి ప్రారంభించాలని. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని, ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రేపు జరగనున్న ఆల్ పార్టీ మీటింగ్‌లో ఇదే ప్రధాన అజెండా ముందుకు వెళ్లాలని ప్రధాన పార్టీ టీడీపీ సహా కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. ఇతర పార్టీలు నిర్ణయించుకున్నాయి.
బీజేపీ విషయం మాత్రం బయట పడకపోయినా.. జనసేన మాత్రం ఆది నుంచి ఎన్నికలు జరగాలని ఇప్పటికే డిమాండ్ చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా వీరి డిమాండ్‌కే మొగ్గు చూపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ, వైసీపీ మాత్రం అసలు ఎన్నికల ప్రస్థావనే వద్దని.. మీరు ఏ కారణంగా అయితే..ఎన్నికలు వాయిదా వేశారో.. కరోనా ఇప్పటికీ రాష్ట్రం నుంచి వీడిపోలేదు.. కాబట్టి.. ఎన్నికలు వాయిదా వేయాలనే డిమాండ్ చేస్తోంది.
దీనిపై ఇప్పటికే మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు.. ప్రభుత్వ భావనను బయట పెట్టారు. కానీ, ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ కూడా ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ హయాంలోనే ఎన్నికలు పూర్తి కావాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? అనేది వైసీపీలో టెన్షన్‌గా మారింది.
అయితే, వీరికి కలిసి వస్తున్న విషయం సుప్రీం కోర్డు ఆదేశాలు. గతంలో ఎన్నికల నిలిపివేతపై జరిగిన విచారణలో నోటిఫికేషన్ రద్దు చేయొద్దని.. కోడ్ మాత్రం ఎత్తేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పూర్తిగా నోటిఫికేషన్ రద్దు చేయడానికి వీల్లేకుండా సుప్రీం తీర్పు వైసీపీని ఆదుకునే అవకాశం ఉంది. ఏదేమైనా.. ఏం జరుగుతుందోనని వైసీపీలో టెన్షన్ అలుముకుంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.