ఏప్రిల్‌లో తిరుమల శ్రీవారికి భారీగా సమకూరిన హుండీ ఆదాయం.. ఏకంగా వంద కోట్లు పైనే

-

తిరుమల శ్రీవారి ఆలయంలో మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి.. రోజుకు లక్షల మంది భక్తులు దర్శనార్థం వస్తుంటారు. రెండు కోట్లకు పైగా కానుకలు ఇస్తుంటారు. మరోసారి రికార్డు స్థాయిలో తిరుపతి హుండీ ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో భక్తులు కానుకల్ని సమర్పించారు. 2022 మార్చి నెల నుంచి ఈ రికార్డు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారిని 20.17 లక్షలమంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీకి కానుకలు రూ.101.63 కోట్లు రాగా.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.08 లక్షలు. ఏప్రిల్‌లో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 94.22 లక్షలు కాగా.. తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 39.73 లక్షలుగా ఉందని ఆలయ అధికారులు తెలిపారు.

అయితే 2022 మార్చి నెల నుంచి తిరుమల శ్రీవారి ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటోంది. అప్పటి నుంచి వరుసగా ప్రతి నెలా రూ.100 కోట్ల ఆదాయం వస్తూనే ఉంది. కరోనా సమయంలో కొద్ది నెలలు తిరుమల శ్రీవారి ఆదాయం మూతపడింది.. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కొద్ది రోజుల వరకూ భక్తుల రద్దీ పెద్దగా లేదు. ఆ తర్వాత మెల్లిగా భక్తుల రద్దీ పెరుగుతూ రావడంతో.. హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. ప్రతి నెలా ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను చేరుతుంది.

తిరుమల శ్రీవారి ఆదాయం మార్చి నెలతో పోలిస్తే తగ్గింది.. మార్చి నెలలో రూ.118 కోట్ల ఆదాయం వస్తే.. ఏప్రిల్ నెలలో రూ.101 కోట్లు వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రభావంతో పాటుగా విద్యార్థులకు పరీక్షల కారణంగా ఆదాయం తగ్గిందంటున్నారు. అంతేకాదు నెల రోజులుగా కొండపై వీకెండ్ మినహా మిగిలిన రోజుల్లో భక్తుల రద్దీ సాధారణంగానే కనిపిస్తోంది. ఇక మే నెలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అందరికి వేసవి సెలవులు ఇస్తారు. కాబట్టి చాలా మంది తిరుమల ట్రిప్‌ ప్లాన్‌ చేస్తారు. దీన్ని బట్టి మార్చి రికార్డు మే నెలలో కచ్చితంగా బ్రేక్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version