తిరుమల శ్రీవారి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆనంద నిలయాన్ని వీడియో తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తెలంగాణకు చెందిన ఈ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితుడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు తెలిసింది. ఆయన వచ్చిన దర్శన టికెట్ ద్వారా ఆధార్ కార్డును సేకరించి అందులోని చిరునామా ద్వారా గుర్తించినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే.. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఓ వ్యక్తి మూడు అంచెల పటిష్ట భద్రతను దాటి మరీ సెల్ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌తో వెళ్లిన సదరు భక్తుడు ఆలయం లోపల హల్‌చల్ చేశాడు. ఆలయం లోపల నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆపై ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీసినట్లు సమాచారం. అయితే భక్తుడు కేవలం ఆనంద నిలయాన్ని చిత్రీకరించారా లేకుంటే ఇంకేమైనా చిత్రికరించాడా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.