2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసి అధికార వైసీపీని జనసేన పవన్ కల్యాణ్ మట్టి కరిపించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కేవలం 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ మొత్తం 23 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగా సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి ఎన్నికయ్యాడు. అలాగే డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అవకాశం దక్కింది.
అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం, అటవీ శాఖల మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి ఉపముఖ్యమంత్రిగా, పలు కీలక శాఖలకు మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి భార్య, ఆయన వదిన అయిన సురేఖ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కొణిదెల సురేఖ.. తన మరిది పవన్ కల్యాణ్ కు ఖరీదైన పెన్నును గిఫ్టుగా తెచ్చింది. కాగా తాను మంత్రిగా తీసుకోబోయే అన్ని నిర్ణయాలకు ఈ పెన్నుతోనే సంతకం చేయాల్సిందిగా కూడా ఆమె కోరినట్లు తెలుస్తోంది.