ప్రయాణికులకు గుడ్ న్యూస్. వందేభారత్ భారత్ రైళ్లలో త్వరలోనే స్లీపర్ తరగతి బోగీలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ బోగీలను అధునాతనంగా తీర్చిదిద్దిన రైల్వే శాఖ త్వరలోనే పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వందే భారత్ రైళ్లకు వస్తున్న ఆదరణతో మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వందే భారత్లో స్లీపర్ బోగీలను తీసుకువస్తోంది.
చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అయితే వీటిలో రెండు.. విజయవాడ డివిజన్‌కు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయవాడ డివిజన్‌లో నడుస్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం, విజయవాడ-చెన్నై సెంట్రల్ రైళ్లకు ఎక్కువ గిరాకీ ఉంది. ఈ మార్గాల్లో స్లీపర్ తరగతి బోగీలతో నడిచే వందేభారత్‌కు మరింత ఆదరణ పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ రైళ్ల కోసం ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా పట్టాల పటిష్ఠతను పెంచి.. భారీగా సాధారణ రైళ్లు రద్దు చేసి నిర్వహణ పనులు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ప్రవేశపెట్టాలనుకున్నా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ముందుగానే ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.