నెలరోజుల పాటు జగనన్న వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఆరోగ్య భరోసా దక్కుతుందని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించడం, అవసరమైనవారికి గ్రామాల్లోనే క్యాంపులు నిర్వహించి వైద్యం అందించడం, పెద్ద ఆస్పత్రులకు సిఫారుసు చేయడం లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు తీసుకొచ్చారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వారి పరిధిలోని అన్ని కుటుంబాలకు వస్తారని తెలిపారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఏఎన్ ఎంలు, క్లస్టర్ హెల్త్ ఆఫీసర్లకు సమాచారం ఇస్తారని చెప్పారు. తర్వాత ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వస్తారని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. అదే గ్రామం, వార్డుల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తారని చెప్పారు. ఈ శిబిరాలు జరిగే సమయానికి అందరికీ ఆరోగ్య నివేదికలను ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలు సిద్ధం చేసి ఉంచుతారని తెలిపారు. ఈ వైద్య శిబిరాలకు స్పెషలిస్టు డాక్టర్లు ఇద్దరు, ఆ మండలంలోని పీహెచ్‌సీ డాక్టర్లు ఇద్దరు మొత్తం నలుగురు వస్తారని తెలిపారు. రోగులకు అక్కడికక్కడే ఈ శిబిరంలో చికిత్స అందజేస్తారని తెలిపారు. ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తారని చెప్పారు. అవసరమైన వారిని పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స కోసం సిఫారుసు చేస్తారని వెల్లడించారు.