బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగితే డాలర్ ప్రాధాన్యం కోల్పోతుందనుకోవడం సరైన అంచనా కాదేమో అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్ పెట్టారు. ‘అంతర్జాతీయ డబ్బు సంబంధిత వ్యవహారాల్లో నిన్న మొన్నటి వరకూ తిరుగులేని రాజైన అమెరికా డాలర్ నెమ్మదిగా తన పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. 2022 మార్చి నాటికి ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా దాదాపు 58 శాతానికి పడిపోయిందని వివరించారు. ఇది 1994 నుంచీ అత్యంత కనిష్ఠం. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సెంట్రల్ (కేంద్రీయ) బ్యాంకులు పాత ఆనవాయితీకి విరుద్ధంగా డాలర్లకు బదులు తమ బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకుంటున్నాయన్నారు.
ఒక్క 2022 సంవత్సరంలోనే ఈ సెంట్రల్ బ్యాంకులు తమ ఖజానాలకు అదనంగా 1126 టన్నుల బంగారాన్ని కొని తరలించాయి. 1950 తర్వాత ఇంత మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకన్నా మరో ఆశ్చర్యకర విషయం ఏమంటే, అనేక దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను తమ సొంత లేదా థర్డ్ పార్టీ కరెన్సీలతో నిర్వహించుకుంటున్నాయి,’ ఈ తరహా వార్తలు గడచిన మూడు నాలుగు నెలలుగా మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మారకం కరెన్సీగా డాలర్ భవితవ్యంపై అమెరికా కాని, ఇతర ధనిక, పారిశ్రామిక దేశాలు గాని ఎక్కువగా దిగులు పడడంలేదని వివరించారు.
అమెరికా 21వ శతాబ్దంలో తనకు అవసరమైనప్పుడల్లా తన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు పెంచడానికి ఎడాపెడా తన కరెన్సీని ప్రింట్ చేసి విడుదల చేస్తోందనీ, దీని వల్ల ఇతర ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా వర్ధమాన దేశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోందనేది కొందరు అంతర్జాతీయ నిపుణులు, కొన్ని పారిశ్రామిక దేశాల ఆరోపణ. అత్యవసర పరిస్థితుల్లో ఏ దేశమైనా తన సొంత కరెన్సీని తాత్కాలికంగా పరిమితికి మించి ప్రింట్ చేయడం తప్పేమీ కాదనే సిద్ధాంతం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఎప్పటిలాగానే అంతర్జాతీయ ఆర్థిక వ్యవహరాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు.