విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి బాంబు బెదిరింపు

-

ఆస్పత్రిలో బాంబు పెట్టామని బెదిరింపు మెయిల్ రావడంతో ఆస్పత్రి వర్గాలు గందరగోళానికి గురయ్యాయి. వెంటనే అప్రమత్తమై రోగులు, సిబ్బందిని అలర్ట్ చేశారు. ఈ క్రమంలో భయంతో రోగులు, వారితో వచ్చిన కుటుంబ సభ్యులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

విజయవాడ ప్రభుత్వ కొత్త హాస్పిటల్లో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్‌తో అటు పోలీసులు, ఇటు ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ‘నేను మీ ఆసుపత్రుల్లో చాలా బాంబులు పెట్టాను. పేలుడు పదార్థాలు కనిపించకుండా దాచాను. అవి కొద్ది గంటల్లో పేలనున్నాయి. మీరందరూ చనిపోతారు. మేం ‘ప్యూనింగ్‌’ అనే తీవ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులం’ అని మెయిల్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మూడు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశామని బాంబు పెట్టినట్లు ఎక్కడా ఆచూకీ కనిపించలేదని వెల్లడించారు. ఈ బెదిరింపు నకిలీదని గుర్తించినట్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఈ ఆస్పత్రికే కాకుండా దేశవ్యాప్తంగా దాదాపు 70 ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు బుధవారం వేకువజామున 4.02 నిమిషాలకు బెదిరింపు మెయిల్‌ పంపినట్లుగా పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news