ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 6 వేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి వసూలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. దీనికోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది కేంద్రం. మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సమాధానం ఇచ్చారు. విభజన సమయంలో విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణకు ఏపీ విద్యుత్ ను సరఫరా చేసిందని చెప్పుకొచ్చారు.
ఈ 6000 కోట్ల బకాయిలను రిజర్వు బ్యాంకు ద్వారా జమ చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీనికోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆర్కే సింగ్ వివరించారు. ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రం చెల్లించవలసిన బకాయిలను రిజర్వ్ బ్యాంక్ ద్వారా జమ చేయవచ్చని న్యాయ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అభిప్రాయంలో చెప్పిందని కేంద్రమంత్రి తెలిపారు.