ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అంటే అర్థమేంటని ప్రశ్నించారు. తెలంగాణ డిమాండ్లకు అంగీకరించినట్లేనా అని చంద్రబాబును నిలదీశారు. బాబు మాటలు చూస్తుంటే ఏపీకి ఏదో ద్రోహం తలపెట్టినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు చర్చించలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏపీలోని పోర్టులో తెలంగాణ వాటా అడుగుతుందని.. టీటీడీ బోర్డు, ఆదాయంలోనూ వాటా కోసం తెలంగాణ పట్టుబట్టిందని అన్నారు. తెలంగాణకు వాటా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై వచ్చిన వార్తలు నిజమేనా అని నిలదీశారు. సమాధానం చెప్పకుండా ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ డిమాండ్లకు బాబు అంగీకరించినట్లేనా అని అన్నారు. మౌనం అర్ధాంగీకారం అనుకోవాల్సి వస్తోందని చెప్పారు. విభజన అంశాలపై చర్చను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏపీ సీఎంగా ఉండి రెండు రాష్ట్రాలు సమానం అని అంటారా? అని మండిపడ్డారు. ఏపీకి చంద్రబాబు ఏదో ద్రోహం తలపెట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. పార్టీ పరంగా బాబుకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు కావచ్చు.. ఏపీ ప్రభుత్వపరంగా చంద్రబాబు వైఖరేంటో చెప్పాలి.