అమరావతి: వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిరామ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పు రూ. 10 లక్షల కోట్లు దాటిందని మేం చెప్తూ వస్తే బుకాయించిన ప్రభుత్వ పెద్దలు.. నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బయటపెట్టిన వివరాలపై ఏం సమాధానం చెప్తారు..? అని ప్రశ్నించారు. ఈ ఏడాది జూలై 18వ వరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.77 లక్షల కోట్లు అప్పు చేసినట్లు బీజేపీ రాష్ట్ర శాఖ కూడా నిర్ధారించిందన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ నుంచి తీసుకున్న నివేదికల ఆధారంగా బీజేపీ వెల్లడించిన అప్పుపై ఆర్థిక మంత్రి బుగ్గన ఏం సమాధానం చెప్తారు.? అని నిలదీశారు. పురందేశ్వరి బయటపెట్టిన వివరాలు బుగ్గన – దువ్వూరి కృష్ణలు తప్పని చెప్పగలరా..? అని సవాల్ విసిరారు. గాడి తప్పిన రాష్ట్ర అప్పులపై గతంలో తెలుగుదేశం బయటపెట్టిన వివరాలను సమర్ధించేలానే పురందేశ్వరి లెక్కలు బయట పెట్టారని అన్నారు. మితిమీరిన ఆర్ధిక అవకతవకలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు పట్టాభి.