టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటీవల కాలంలో ఏమైందో ఏమో .. కేంద్రంలోని నరేంద్ర మోడీని చీటికీ మాటికీ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తిరుమల శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధనం చేసిన విధంగా.. చంద్రబాబు మోడీకి చేస్తున్నారా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ సోషల్ కామెంట్‌లో చంద్ర బాబు మరీ ఇంట భట్రాజ్ అయిపోయారేంటి? అనే అనేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం ఒక్కసారి పరిశీలిస్తే.. ఆయన ఎవరితోనూ శాశ్వత శతృత్వం పెట్టుకున్న సందర్భాలు లేవు. అందుకే 2018లో తెలం గాణ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు.
నిజానికి అప్పటి వరకు కూడా ఏపీని విభజించారు అని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అంతేకాదు, ఏపీకి ఏమొహం పెట్టుకుని వస్తారంటూ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు కానీ, ఇంతలోనే రాజకీ యంగా తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఏపీలో అధికారంలోకి వచ్చి న చంద్రబాబు.. తర్వాత పదవులు కూడా పంచుకున్నారు. ఇంతలోనే హోదా విషయంపై ప్రజల్లో తిరు గుబాటు వచ్చేసరికి పంథా మార్చుకున్నారు. బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించేందుకు, నరేంద్ర మోడీని తరిమేసేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.
సరే! ఏపీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, మోడీ మళ్లీ అధికారంలోకి రావడంతో బాబు మైనస్ అయిపోయారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్నప్పటికీ.. మళ్లీ బాబు మోడీ పాట అందుకున్నారు. ఆయన ఏం చేసినా.. ఆహా ఓహో అనడం ప్రారంభించారు. జమ్ము కశ్మీర్‌ను విడగొట్టినప్పుడు, తలాక్‌ను ఎత్తేసినప్పుడు.. నీ అంత వాడు లేడంటూ.. ఇక్కడ నుంచి లేఖలు రాశారు. ఇక, లాక్‌డౌన్ విషయంలోనూ మోడీని కీర్తించకుండా ఉండలేక పోతున్నారు. ఒక పక్క, తమకు నిధులు ఇవ్వకుండా మందు అమ్ముకొని సంపాయించుకోండని మోడీ చెపుతుండడంపై రాష్ట్రాల సీఎంలు నిప్పులు చెరుగుతున్నారు.
కానీ, బాబు మాత్రం మోడీ వ్యూహం, విజను సూపర్ అంటూ లేఖలపై లేఖలు రాస్తున్నారు. గతంలో 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు మోడీని నెత్తినెత్తుకున్నారు. అయితే, ఆర్దిక వేత్తలు మాత్రం మోడీని తిట్టిపోశారు. ఇప్పుడు తాజాగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు కూడా బాబు పొగిడేశారు. నిజానికి ఇప్పుడు మోడీని పొగిడే ప్రధాన బ్యాచ్ కూడా అసలు దేనికెంతో తేల్చిన తర్వాత కీర్తనలు పాడదామని వెయిట్ చేస్తుంటే.. బాబు తగుదునమ్మా..అంటూ అందరికన్నాముందే మోడీని హిమాలయాలపై కూర్చోబెట్టారు. దీంతో బాబు సీఎం పదవి పోయాక భట్రాజు ఉద్యోగం బాగా చేస్తున్నారని అంటున్నారు సోషల్ మీడియాలో జనాలు. ఇంత చేసినా.. మోడీ ఎక్కడాబాబును పట్టించుకోకపోవడం గమనార్హం.