ఏపీ రాజకీయాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. మరికొద్ది గంటల్లో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియనుంది. అయితే ఈ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ ఉంది. దానికి గల కారణం అక్కడ బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని ఈసారి మాత్రం తప్పకుండా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. సర్వేలు కూడా ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి. మరోవైపు పిఠాపురంలో ఎన్నడూలేని విధంగా 86.63శాతం పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి వరకూ మహిళలు సైతం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు దీరారు.
ఈ నేపథ్యంలో పవన్ గెలుపు ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. జూన్ ఒకటిన వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సర్వే సంస్థలు పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని వెల్లడించాయి. మరికొన్ని సర్వేలు వైసీపీ అభ్యర్థిని వంగా గీత గెలుస్తారని అంచనా వేశాయి. పవన్ గెలుపు ఏ విధంగా ఉంటుందనే దానిపై బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. పవన్ గెలిస్తే ఒక చరిత్ర సృష్టిస్తారన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. గెలుపు, మెజార్టీ పరంగా పవన్ కల్యాణ్ విజయం కొన్నాళ్లపాటు నిలిచిపోయేలా ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.