వన్డే క్రికెట్లో భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 50 సెంచరీలను సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సీబీఐ కేసులకు హాజరు కాకుండా 3041 సార్లు వాయిదాలను కోరి సరికొత్త రికార్డు నెలకొల్పారని నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ సందర్భంగా క్రికెట్ అభిమానులు మ్యాచ్లను తిలకించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాలలో, పట్టణాలలో పెద్ద పెద్ద స్క్రీన్ లను ఏర్పాటు చేశారని తెలిపారు.
అయితే క్రికెట్ మ్యాచ్ మధ్యలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆడిన గల్లీ క్రికెట్, ముఖ్యమంత్రి అయ్యాక క్రికెట్ బ్యాటు పట్టిన ఫోటోలను, జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి శరత్ చంద్రారెడ్డి ఉన్న ఫోటోలను ప్రదర్శించడం పట్ల అభిమానులు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు తిలకించడం కోసం బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఖర్చు చేస్తుంటే, మధ్యలో జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోలను ప్రదర్శించడం ఎందుకంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేశారని, అన్ని ఆస్తులపై జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోలను ముద్రిస్తున్నారని, కుదిరితే తండ్రిది, కుదరకపోతే కుమారుడి పేరును సంక్షేమ పథకాలకు పెడుతున్నారని, ఇంకా క్రికెట్ మ్యాచ్ లు తిలకించే సమయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోలను ప్రదర్శించి హింసించడం అవసరమా అంటూ నిలదీస్తున్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.