సైద్ధాంతిక విభేదాల దృష్ట్యా వైకాపాను ఎన్డీఏ కూటమికి బీజేపీ నాయకత్వం దరిచేరనివ్వలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో గత మూడేళ్లుగా కలిసేందుకు వైకాపా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉందని, ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఒకవైపు ప్రయత్నిస్తూనే, మరొకవైపు తమను ఎన్డీఏ కూటమిలో చేరామని బీజేపీ నాయకత్వం కోరుతున్నట్లుగా వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు చెప్పేవారన్నారు. ఎన్డీఏలో చేరుతామని వైకాపా నాయకత్వమే బీజేపీ నాయకత్వాన్ని కోరిందని… కానీ దానికి బీజేపీ నాయకత్వం అంగీకరించలేదని తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి గారికి కావలసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి, ఢిల్లీలో కేసుల నుంచి విముక్తి మాత్రమేనన్నారు. గో రక్షక్ పార్టీ బీజేపీ అయితే, గో భక్షక్ పార్టీ వైకాపా అని, ఈ రెండు పార్టీల మధ్య సక్రమ సంబంధానికి తావే లేదన్నారు. అయినా రాష్ట్ర ప్రజలు తప్పు చేసి జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించినా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రభుత్వమని… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఆయనని గౌరవించారని ఒక ప్రశ్నకు సమాధానంగా రఘురామకృష్ణ రాజు గారు చెప్పారు.