వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, విశ్రాంతి తీసుకోవాలని జగన్ నానికి సూచించారు.
ఇక బుధవారం రోజున ఛాతీలో నొప్పి రావడంతో కొడాలి నానిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయణ్ను పరీక్షించిన వైద్యులు నానికి గుండె సంబంధిత సమస్యలున్నాయని నిర్ధారించారు. వైద్య పరీక్షల్లో గుండెలో మూడు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు గుర్తించారు.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. త్వరలోనే సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు కొడాలి నాని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నానికి మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అయితే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతారని మొదటి నాని ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు బయటకు వెల్లడించలేదు.