జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడిన వారు చాలా మంది ఉన్నా ఈ లిస్టులో నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా కూడా ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబు రెండు సార్లు సీటు ఇచ్చినా.. ఆ రెండు సార్లు కూడా ఆమెకు ఇష్టం లేని చోటే సీటు ఇచ్చారు. 2004లో నగరిలో చెంగారెడ్డిపై నిలబెట్టి ఓడించారు. ఇక 2009లో ఆమెకు ఇష్టంలేకపోయినా చంద్రగిరికి పంపి బలవంతంగా గల్లా అరుణపై పోటీ చేయించగా అక్కడ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె వైసీపీలో చేరి ఎన్నో కష్టాలు పడి 2014లో నగరి నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో రోజాను టీడీపీ మామూలుగా టార్గెట్ చేయలేదు.
చివరకు 2019లో రోజా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా గెలవడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారు. ప్రత్యేకించి ఆమె చిత్తూరు జిల్లా నుంచి గెలవడం.. ఇటు సామాజిక సమీకరణలు కలిసి రాకపోవడంతో ఆమెకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్న వారికి, ఆమెకు షాక్ తప్పలేదు. అయితే జగన్ ఆమెకు ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. రోజాకు బలమైన వాయిస్సే ఆమెకు ప్లస్. ఈ వాయిస్‌తో చాలా మంది సీనియర్లను సైతం ఆమె వెనక్కు నెట్టేస్తుండడం వారికి నచ్చడం లేదు.
పెద్దిరెడ్డికి రోజాకు మధ్య ఉన్న గ్యాప్‌నకు ప్రధాన కారణం ఆమె దూకుడు, వాయిస్సే కారణం అంటారు. ఇక పెద్దిరెడ్డితో రోజాకు ఎప్పటి నుంచో కోల్డ్‌వార్ నడుస్తోంది. రోజా కూడా పెద్దిరెడ్డిపై వీలున్నప్పుడల్లా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆమె పెద్దిరెడ్డితో పాటు ఆయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని ఆకాశానికి ఎత్తేశాలా ప్రశంసలు కురిపించడంతో పాటు అదే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై విరుచుకు పడడం ఆశ్చర్యంగా ఉంది. ఇకపై తాను తన నియోజకవర్గంలోకే పరిమితమవుతానని.. ఇతర నియోజకవర్గాల గురించి తనకు అనవసరం అని ఆమె చెప్పారు.
అక్కడితో ఆగకుండా ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో మరో వ్యక్తి వేలు పెడితే సహించడని రోజా తెలిపారు. మరి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తాను డిప్యూటీ సీఎం కావడంతో ఎక్కడికైనా వెళతానన్నారు కదా ? అని ప్రశ్నిస్తే ఆయన ఆ విషయం జగన్‌కు చెప్తారా ? అంత ధైర్యం ఆయనకు ఉందా ? అని ఆయన్ను టార్గెట్ చేసింది. కొద్ది రోజుల క్రితమే నారాయణ స్వామి రోజాకు చెప్పకుండా నగరిలో పర్యటించారు. ఇక జగన్ జిల్లాలకు వచ్చేటప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పే వస్తారని… జగన్ తాను రాష్ట్రానికి సీఎం అని కదా ? అని వ్యవహరించరని.. ఏ నియోజకవర్గంలోకి వెళ్లాలనుకున్నా సదరు ఎమ్మెల్యేలకు చెపుతారని పరోక్షంగా నారాయణ స్వామికి సుతిమెత్తని హెచ్చరిక జారీ చేశారు. ఏదేమైనా రోజా పెద్దిరెడ్డిని ప్రశంసిస్తూ నారాయణస్వామిని టార్గెట్ చేయడం వైసీపీలో సరికొత్త చర్చకు దారితీసింది.
-Vuyyuru Subhash