ప్రధాని నరేంద్రమోడీ తన గ్యారంటీల గురించి గొప్పగా చెప్పుకుంటుండటంపై తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ గ్యారెంటీలకు జీరో వారంటీ ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభ వేడుకగా టీఎంసీ ఇవాళ కోల్‌కతాలో ‘జన గర్జన్ సభ’ నిర్వహించింది. ఆ సభలో ప్రసంగిస్తూ అభిషేక్ బెనర్జీ ప్రధానిపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ నాయకులు బయటి వ్యక్తులని, బెంగాల్ వ్యతిరేకులని అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రాన్ని సందర్శిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి రాష్ట్రం గుర్తొస్తుందని అన్నారు. వారందరికీ రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఎంసీ మాత్రమే హామీలను నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపేసిందని ఆరోపించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తాజాగా గ్రాండ్ ర్యాలీతో ప్రారంభించింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.