చిన్నపిల్లలకు మెల్లకన్ను ఉంటే పెద్దయ్యాక ఇన్ని వ్యాధులు వస్తాయా..?

-

పిల్లలకు పుట్టుకతో కొన్ని వ్యాధులు వస్తాయి.. పెరిగేకొద్ది కొన్ని వ్యాధులు బయటపడతాయి. పిల్లలకు ఏడేళ్లు వచ్చేసరికి ఇలాంటివి అన్నీ బయటపడతాయి. మెల్లకన్ను ఉంటే కొందరికి పుట్టినప్పుడే తెలుస్తుంది. కొందరికి వయసు పెరిగే కొద్ది తెలుస్తుంది. ఈ మెల్లకన్నును స్కింట్‌ ఐ అని కూడా అంటారు..ఇది తీవ్ర స్థాయిలో లేకపోతే.. పెద్దగా సమస్య ఉండదు.. కానీ ఎక్కువగా ఉంటే.. వారి ముఖం రూపం వేరేలా ఉంటుంది అంతకుమించి ఏం సమస్య ఉండదు అనుకుంటారు.. కానీ పిల్లలకు మెల్లకన్ను ఉంటే.. వారికి భవిష్యత్తులో కొన్ని వ్యాధులు వస్తాయని అధ్యయనం చెబుతోంది. ఏ పిల్లలైతే ఇలా మెల్లకన్నుతో ఇబ్బంది పడతారో పెద్దయ్యాక వారు అధిక రక్తపోటు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుందట.. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా వారికి ఎక్కువేనని ఈ కొత్త పరిశోధన తేల్చింది.

బ్రిటన్లోని లండన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 40 నుంచి 69 ఏళ్ల సంవత్సరాల మధ్య గల లక్షా 26 వేల మందిని ఎంపిక చేశారు. వారి కంటి ఆరోగ్యం డేటాను సేకరించారు. వీరు చిన్నప్పుడు మెల్లకన్ను (ఆంబ్లియోపియా) సమస్యతో బాధపడ్డారా? దానికి చికిత్స తీసుకున్నారా? వంటి వివరాలను కనుక్కున్నారు. అలాగే యుక్త వయసులో వారి ఆరోగ్యం ఎలా ఉంది? ఎలాంటి సమస్యల బారిన వారు పడ్డారో వివరాలను సేకరించారు. వారికి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయేమో తెలుసుకున్నారు. అలాగే వారి బాడీ మాస్ ఇండెక్స్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్‌ చేశారు.

ఈ డేటాలో వారికి 1,26,000 మందిలో 3,238 మంది చిన్నప్పుడు మెల్లకన్నుతో బాధపడినట్టు తేలింది. వారిలో 82 శాతం మంది పెద్దయ్యాక ఒక కంటి చూపును కోల్పోయినట్టు కూడా వివరించారు. చిన్నతనంలో ఎవరైతే ఆంబ్లియోపియా సమస్యతో బాధపడ్డారో… వారిలో 29 శాతం మందికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాగే హై బీపీ వచ్చే ప్రమాదం 25 శాతం ఎక్కువ అని, ఊబకాయం బారిన పడే అవకాశం 16% ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు.

గుండెపోటు ప్రమాదం కూడా అధికంగా ఉన్నట్టు వారు తేల్చారు. కాబట్టి చిన్నప్పుడు ఆంబ్లియోపియా సమస్యతో బాధపడుతున్న చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి యుక్త వయసు వచ్చేసరికి ఇలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది..కాబట్టి వారికి పోషకాహారాన్ని అందిస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చిన్నప్పుడు ఆంబ్లియోపియా సమస్యకు చికిత్స చేయించినప్పటికీ పెద్దయ్యాక వారిలో ఒక కంటి చూపు తగ్గే అవకాశం ఎక్కువే ఉంటుందట.

పిల్లలకు ఆంబ్లియోపియా సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఐదేళ్ల వయసులోపే కంటి చికిత్సలు చేయించడం ముఖ్యం. దీనివల్ల సమస్యను ముందుగానే అంచనా వేసి చికిత్సను ప్రారంభించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version