ఉత్తర ప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మరో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. పోలీసులు ఎప్పటిలాగే సదరు గ్యాంగ్ తమకు ఎదురుపడింది.. వాళ్లు కాల్పులు ప్రారంభించడంతో తాము కూడా ఆత్మ రక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపాం..ఈ ఎన్ కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ చనిపోయాడు.. అంటూ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 190 మంది ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు.
హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ప్రజల భూములను కబ్జా చేయడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తుల పేర్లతో సహా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాను యోగి ప్రభుత్వం గత నెలలో విడుదల చేసింది. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ సెగ్మెంట్ పరిధిలో అనిల్ దుజానా జాబితాలో ఉన్నారు. పశ్చిమ యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా… యూపీ ఎస్టీఎఫ్-మీరట్ యూనిట్ కలిసి జరిపిన ఎన్ కౌంటర్ లో హతమైనట్లు అదనపు డీజీపీ అమితాబ్ యాష్ తెలిపారు. అతనిపై అనేక కేసులు ఉన్నాయని, అతను కాంట్రాక్ట్ కిల్లర్ అని, అతనిపై 18 హత్య కేసులు ఉన్నాయని వెల్లడించారు.