వైఎస్సార్ ఆసరా పేరుని జగనన్న టోకరా గా మార్చుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ ఇచ్చిన హామీలను ఆయనకు పదేపదే టీడీపీ గుర్తుచేయాల్సి రావడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలంతా ప్రభుత్వం ఇస్తున్న ఆసరా సొమ్ముతోనే బతుకుతున్నట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. 5 లక్షల వరకు తీసుకునే రుణం మొత్తానికి వడ్డీ లేకుండా చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చేయూత నిచ్చిందని అనిత పేర్కొన్నారు.
రుణ పరిమితిని రూ.7న్నర లక్షలవరకు పెంచుతానని, ఆ మొత్తానికి వడ్డీలేకుండా చేస్తానని జగన్ పాదయాత్రలో, తనపార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడని, అధికారంలోకి వచ్చాక గ్రూప్ మొత్తానికి ఇచ్చే సొమ్మును రూ.3 లక్షలకే పరిమితం చేశాడని అన్నారు. రూ.3లక్షల లోపు తీసుకునే వారికే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందంటూ కొత్త మెలిక పెట్టారని, రూ.3 లక్షల లోపు రుణం తీసుకునే డ్వాక్రా గ్రూపులు కేవలం పదిశాతం మాత్రమే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కేవలం పదిశాతం మందికి మాత్రమే ఉపయోగపడేలా కొత్తపథకం తెచ్చి, దానిగురించి నృత్యాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు.