తెలంగాణలో కేసీఆర్ పార్టీ… కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారిందని, ఓ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ లేదా ఒక కుటుంబం చుట్టూ తిరిగితే అది రాష్ట్రానికి మంచిది కాదని, శ్రీలంకలోనూ కుటుంబ పాలన కారణంగా దేశం నాశనమైందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణలోని శేరిలింగంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. విభజన తర్వాత కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ అమలు చేయలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఆరున్నర లక్షల కోట్లు అప్పులు చేశారని ధ్వజమెత్తారు.
దేశమంతా ఇప్పుడు నరేంద్రమోదీ మోడల్ కోరుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలన అవినీతికి మోడల్ గా మారిందన్నారు. బీజేపీ హయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ .. కాంగ్రెస్ కు బీటీమ్, ఎంఐఎం.. బీఆర్ఎస్ కు బీ టీమ్ అని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు ఇన్సూరెన్స్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినీ ఇండియాగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉందని, ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడనే రవికుమార్ యాదవ్ కు బీజేపీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. రవికుమార్ యాదవ్ లాంటి మంచి వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు.. శేరిలింగంపల్లిలో బీజేపీ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో అన్నామలై పాల్గొన్నారు.